Monday, February 14, 2011

పొలిటికల్‌ వాలెంటైన్లు .... ‘ప్రేమ’ కీయాలు

cartoons
ఇది ప్రేమలు చిగురిస్తున్న కాలం. ‘మనసున ఉన్నది చెప్పాలనున్నదీ మాటలు రావే ఎలా? మాటున ఉన్నదీ ఓ మంచి సంగతీ బయటకు రాదే ఎలా? అతడిని చూస్తే చెప్పక ఆగిపోయే తలపులు తెలిపేదెలా?’ అన్న కాలం నుంచి.. ‘అరెరె.. అరెరె మనసే జారే. అరెరె అరెరె వయసే జారే. ఇదివరకెపుడూ లేదే. ఇది నా మనసే కాదే. ఎవరేమన్నా వినదే’ అన్న స్థాయికి చేరుకున్న ప్రేమ కాలమిది. మునుపటిలా మనసులో ఉన్న ప్రేమను దాచుకునే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రేమలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ గగనతలంపై ప్రేమ పావురాలు ఉత్సాహంతో కనిపిస్తున్నాయి. గతంలో రాజకీయ పార్టీల నడుమ పొత్తు ప్రేమలు మాత్రమే ఉండేవి. అవి ఆ తర్వాత వికటించేవి. మళ్లీ పరిఢవిల్లేవి. అవి ఆక్షరణతో కూడిన ప్రేమలు. అందులో నిజాయితీ ఉండదు. అవన్నీ ఓట్ల ప్రేమలు! ఎన్నికలు తర్వాత ఆకర్షణలు వికర్షణలవుతాయి. వికర్షణలు ఆకర్షణలవుతాయి.

తాజా రాజకీయ ప్రేమలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఊహించని విధంగా కొత్త మలుపు తిరిగి సుఖాంతమవుతు న్నాయి. అయితే సినిమా ప్రేమల మాదిరిగా రాజకీయ ప్రేమల్లో విలన్లు ఎవరూ లేరు. హీరో, విలను అంతా ఒక్కరే. సినిమాల్లో ప్రేమికులను విడదీసేందుకు తలిదండ్రులు, విలన్లు కనిపిస్తారు. కానీ రాజకీయ ప్రేమలు కలవకుండా సాధ్యమైనంత వరకూ రెచ్చగొట్టేందకు మరొక రాజకీయ పార్టీ మాత్రమే కనిపిస్తుంది. సినిమా ప్రేమలకు, రాజకీయ ప్రేమలకు అదొక్కటే తేడా!

కాంగ్రెస్‌ పార్టీని దాదాపు రెండున్నరేళ్ల పాటు పంచెలు ఊడదీసి కొట్టాలనేంతగా ద్వేషించిన ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కొద్దికాలం నుంచి అదే కాంగ్రెస్‌ పార్టీపై ప్రేమ పుట్టుకొచ్చింది. అది ముదురుపాకానపడి చివరకు పెళ్లిదాకా వచ్చింది. కాంగ్రెస్‌-ప్రజారాజ్యం మధ్య లగ్నపత్రికలు రాసుకోవడాలు, మాట-ముచ్చట్లూ పూర్తయి, వచ్చే ఏప్రిల్‌లో వివాహబంధానికి ముహుర్తం ఖాయమ యింది. ద్వేషం నుంచే ప్రేమ పుడుతుందనడానికి కాంగ్రెస్‌-పీఆర్పీ బంధమే నిలువెత్తు నిదర్శనం. కాంగ్రెస్‌పై మనసులో చిగురించిన ప్రేమను వ్యక్తం చేయడానికి స్వయంగా చిరంజీవి నడుంబిగించారు. ఆయన ‘స్వయం కృషి’ని మెచ్చిన ఢిల్లీ నాయకత్వం చిరు ప్రేమను పెద్ద మనసుతో అంగీకరించింది. ఆ ప్రకారంగా ఒక ప్రేమ 70 లక్షల మంది ఓట్లేసిన ఒక రాజకీయ పార్టీ అంతర్ధానానికి కారణమయింది. అయితే, వారి ప్రేమను విడదీసేందుకు టీడీపీ-వామపక్షాలు-బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా చివరికి ‘వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు‘.

ఇక ఇప్పుడు మరో ముక్కోణ రాజకీయ ప్రేమ పండుతోంది. అది పాకాన పడటమే ఆలస్యం. ఒక ప్రేమికురాలి కోసం ఇద్దరు ప్రియులు ఆశతో ఎదురుచూస్తున్నారు. పీఆర్పీ తనపై చూపిన చూపిన ప్రేమను ఆసరా చేసుకున్న కాంగ్రెస్‌ ఆ పార్టీని తనలో వి‘లీనం’ చేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రేమ కోసం కాంగ్రెస్‌ పరితపిస్తోంది. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ కూడా కాంగ్రెస్‌పై మనసున దాచుకున్న ప్రేమను వ్యక్తీకరించలేక, ప్రేమిస్తూ ప్రేమించనట్లుగా వ్యవహరిస్తోంది.

ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ జనాకర్షణ ఉన్న ప్రేయసి. ఇప్పుడు ఆ ప్రేయసి కోసం అటు కాంగ్రెస్‌, ఇటు జగన్‌ వల వేస్తున్నారు. కానీ, తెలివైన టీఆర్‌ఎస్‌ ప్రేయసి కాస్త లెక్కల మనిషి. పల్సు చూసి కాకుండా పర్సు చేసే ప్రేయసి అనే నింద మోస్తోంది. ఇద్దరినీ తన వైపు ఆ ర్షించుకునే ప్రయత్నాల్లో ఉంది. సీమాంధ్రలో జగన్‌, తెలంగాణలో మనం స్వీప్‌ చేస్తామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. మళ్లీ అదే కేసీఆర్‌ తెలగాణ ఇస్తే సోనియా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటాననీ అన్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని విశాల హృదయంతో అంగీకరించారు.
తెలంగాణలో జనాకర్షణ ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రేయసి తమ ప్రేమను అంగీకరిస్తే ఆ ప్రాంతంలో తమ ఓట్ల పంటకు ఢోకా లేదన్నది కాంగ్రెస్‌-జగన్‌ అంచనా.

అందుకే ఇద్దరూ టీఆర్‌ఎస్‌పై ప్రేమ బాణాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌ అయితే, ఒక అడుగు ముందుకేసి పీఆర్పీ మాదిరిగానే టీఆర్‌ఎస్‌నూ తనలో ఐక్యం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. అయితే.. కాంగ్రెస్‌లో తాను ఐక్యమవుతానన్న కథనాలను టీఆర్‌ఎస్‌ ప్రేయసి ఖండిస్తున్నప్పటికీ.. ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తుందో తెలియని టీఆర్‌ఎస్‌ ప్రేయసి మాటలను సహజంగా ఇప్పుడూ ఎవరూ నమ్మడం లేదు. ఆ లెక్కన .. పాపం జగన్‌ భగ్న ప్రేమికుడు కాక తప్పదు.

ఇక గత ఎన్నికల ముందు టీడీపీని ద్వేషించి, ఆ పార్టీ పుట్టిమునగడానికి కారణమయిన లోక్‌సత్తాలో కూడా ప్రేమ చిగురిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో టీడీపీ చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ కూడా టీడీపీ వైపు మనసు పారేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. నిజంగా అదే జరిగితే ఎక్కువమంది ప్రియులతో రాజకీయ ప్రేమ సాగిస్తున్న ఘనత టీడీపీ ప్రియుడికే దక్కుతుంది.

ఇక ఎలాగూ వామపక్షాల ప్రియులు టీడీపీ పార్కులోనే విహరిస్తున్నారు. కొత్త ప్రేమికురాలయిన లోక్‌సత్తా రాకతో టీడీపీ ప్రేమవనం కళకళలాడనుంది. పాపం ఎటొచ్చీ ఒక్క ప్రేయసీ దొరక్క దేవదాసులా కనిపిస్తోంది బీజేపీ మాత్రమే. నుదుట పొడువాటి బొట్టు పెట్టుకుని, కాషాయ కండువాలేసుకున్న కమలం వైపు చూసేందుకు ఎవరూ సాహసించడం లేదు. దానితో కలిస్తే ఆ రంగులన్నీ తమకు ఎక్కడ అంటుకున్నాయోనన్న భయం, తమ లౌకికవ్రతం ఎక్కడ భంగమవుతుందోనన్న ఆందోళన మరి! ఎప్పటికయినా ఒక్క ప్రేయసి అయినా తన వద్దకు రాకపోతుందానన్న ఆశతో బీజేపీ ప్రేమికుడు ఎదురుచూస్తున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా అందరి ఆశలు తీరాలని ఆశిద్దాం.