Saturday, May 19, 2012

పైసతో కాదు.. పేరుతో పెరగా'లనేది మా అమ్మ

'నాకున్న బ్యాగ్రౌండ్ ఇంకే పొలిటికల్ లీడర్‌కి లేదు'. ఈ డైలాగ్ ఏ సినిమాలోదబ్బా... అనుకుంటున్నారా! ఇది సినిమా డైలాగ్ కాదు. మీ ఊరు గురించి చెప్పండంటూ కాంగ్రెన్ సీనియర్ నేత శంకరరావు దగ్గరికి వెళ్లినపుడు 'నవ్య'తో ఆయన చెప్పిన మొదటి మాట ఇది. 'నేను పుట్టి పెరిగింది పట్టణంలోనైనా పెద్దయ్యాక నన్ను ఒక ఊరు చేరదీసింది. ముప్పైఏళ్లపాటు తన ఒడిలో నాకింత చోటిచ్చి నన్నింతవాణ్ణి చేసింది' అంటూ ఆ ఊరి విశేషాలు చెప్పుకొచ్చారు. 'మీది ఏ ఊరు? అని ఎవరడిగినా నేను వెంటనే చెప్పే సమాధానం షాద్‌నగర్' అని అంటున్న పి.శంకర్రావు కబుర్లే ఈ  'మా ఊరు'.

"నాకు ముప్పైఏళ్ల వయసుండగా మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్ గ్రామంలో అడుగుపెట్టాను. చేతిలో మెడికల్ కిట్, నాలుగు జతల బట్టలు, భార్యా పిల్లల్ని వెంటపెట్టుకుని ఊళ్లో దిగాను. రెండు రూములు అద్దెకు తీసుకున్నాను. నెలకు ఎనభై రూపాయల అద్దె. అదే రోజు సాయంత్రం ఊళ్లో సవాయి (దండోర) వేస్తున్నారు. 'రేపు పొద్దుమీకి(సాయంత్రం) దొరొస్తున్నడో....' అన్న అరుపులు వినిపించాయి. మర్నాడు ఊరిమధ్యన జనమంతా గుమిగూడారు. నేను కూడా వెళ్లాను. గుర్రాల డెక్కల శబ్దం వినిపించగానే జనమంతా చేతులు కట్టుకుని కూర్చున్నారు. నాలుగు గుర్రాలపై దొరలు వచ్చారు. గుర్రాలకు అటు, ఇటు పదిమంది పనోళ్లు జరుగుండ్రి... జరుగుండ్రి... దొరలొస్తున్నరు అంటూ జనాన్ని తోసుకుంటూ వస్తున్నారు. దొరలు గుర్రాలపై నుంచి దిగి గద్దె ఎక్కి ఒక ప్రకటన చేశారు. 'నాలుగు రోజుల్లో పంటలు ఇళ్లకు వస్తాయి. ఊరి ప్రజలందరికీ భోజనాలు పెడదామనుకుంటున్నాం' అని చెప్పారు. ఊరి జనమంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు.

ఆ మర్నాడు ఊరంతటికి భోజనాలు. తర్వాత ఆటలు, పాటలు. దొరలు గద్దెమీద కూర్చుని తిలకించేవారు. ఆ రోజు ఎవ్వరి ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు. ఆ సీన్ చూశాక నాకు మతిపోయింది. ఆ ఊరిజనంపై దొరలు చూపించేది ప్రేమా, పెత్తనమా? అని తేల్చుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. నేను ఆ ఊరికి వెళ్లకముందు షాద్‌నగర్ గురించి తెలుసుకున్న విషయాలకు, అక్కడున్న వాస్తవాలకు అస్సలు పోలిక లేదు. దేశంలో గ్రామపంచాయితీ వచ్చిన మొట్టమొదటి ఊరు షాద్‌నగర్. 1956లో పండిత్ జవహర్‌లాల్ నెహ్రు చేతులమీదుగా షాద్‌నగర్ గ్రామపంచాయితీ అయ్యింది.

అంతటి చరిత్ర ఉన్న ఊరికి వెళుతున్నానని చాలా గర్వపడ్డాను. కాని వెళ్లాక అక్కడి వెనకబాటుతనం చూసి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఊరి ప్రజల్ని కూడా మార్చాలనుకున్నాను. షాద్‌నగర్ చాలా పెద్ద ఊరు. పదివేలమందికి పైగా జనాభా ఉండేవారు. ఆ చుట్టుపక్కల పదుల సంఖ్యలో ఉన్న ఊళ్లకు అదే గ్రామపంచాయితీ. వందేళ్ల క్రితం కట్టిన దేవాలయాలు, దొరలు, రైతులతో ఊరు ముచ్చటగా ఉండేది.

డాక్టరొచ్చిండు...

నేను అప్పటికే పి. వి నర్సింహారావు, డి. శ్రీనివాస్, కోదండరామిరెడ్డి, నటరాజ రామకృష్ణ వంటి ప్రముఖులకు ఫ్యామిలీ డాక్టర్‌ని. డిగ్రీ చదువుతున్న సమయంలోనే యూత్‌క్రాంగెస్ లీడర్‌గా పనిచేశాను. 1980లో రాజకీయాల్లోకి వచ్చి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. రిజర్వేషన్ కోటాకింద షాద్‌నగర్ నుంచి నాకు పిలుపొచ్చింది. వెంటనే బయలుదేరి వెళ్లాను. ఎక్కడికి వెళ్లినా చేతిలో మెడికల్ కిట్ మాత్రం వదిలేవాడ్ని కాదు. ఆ ఊరికి కూడా అలాగే వెళ్లాను. ఆ ఊరి ఆసుపత్రిలో ఫ్రీ కన్సల్టెన్సీ పెట్టాను. రోజుకి వందమందికి పైగానే చూసేవాడ్ని.

ఆ ఊరివాళ్లంతా నన్ను ' పేదోళ్ల డాక్టర్ ' అని పిలవడం మొదలుపెట్టారు. నేను వెళ్లింది ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే అయినా అక్కడి ప్రజలకు డాక్టర్‌గానే దగ్గరయ్యాను. పేదరికం ఉన్న చోట జబ్బులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఊళ్లో దొరలకు జబ్బులొస్తే కార్లపై పట్టణాలకు వెళ్లేవాళ్లు. మిగతావాళ్లకు ఊళ్లోని ఆసుపత్రే గతి. ఉచితంగా వైద్యం చేసే నన్ను దేవుడిలా చూసేవారు. పొద్దున లేవగానే ఊళ్లన్నీ తిరిగేవాడ్ని. సాయంత్రమయ్యే సరికి దవఖానలో ఉండేవాడ్ని.

భవంతులు..గుడిసెలు..

ఊళ్లో ఒక పక్కగా దొరల భవంతులుండేవి. పెద్దరెడ్లు, చెంచోడు దొరలు ఎక్కువగా ఉండేవారు. ఒక్కో ఇల్లు రెండెకరాల్లో ఉండేది. కార్లు, గుర్రాలు, ఖరీదైన శునకాలు వారి ప్రతిష్టకు తగ్గట్టు గుమ్మం ముందు కనిపించేవి. దొరలు కాకుండా మరెవ్వరు గుమ్మంలోకి వెళ్లినా గడపలోపలికి అడుగుపెట్టనిచ్చేవారు కాదు. నేను దొరను కాదు, డబ్బున్నవాడిని అంతకన్నా కాదు. అయినా నేను వాళ్లిళ్లలోకి నేరుగా వెళ్లేవాడ్ని. కారణం నా డాక్టర్ పట్టా. నేను గనక డాక్టర్‌ని కాకపోయి ఉంటే ఎమ్మెల్యే అయినా సరే దొరల గుమ్మం తొక్కే అవకాశం ఉండేది కాదేమో.

మెల్లమెల్లగా నాతోపాటు ఊళ్లోని జనాన్ని తీసుకెళ్లేవాడ్ని. మొదట్లో చిన్న చిన్న ఆంక్షలు పెట్టినా పట్టించుకోకుండా అందరం ఒక్కటే అన్న సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చాను. ఇద్దరు ముగ్గురు దొరలు అడ్డంపడ్డా నేను లెక్కచేయలేదు. ఊళ్లో నలభైశాతం గుడిసలే ఉండేవి. మిగతావన్నీ పెంకుటిళ్ళు. మహబూబ్‌నగర్ అనారోగ్యాలకు, ఆకలిచావులకు, వలసలకు పెట్టింది పేరు. ఆ లక్షణాలు షాద్‌నగర్‌లో కూడా కనిపించేవి.

సీతాఫలం కేరాఫ్...

ఊళ్లో రైతులు ఎక్కువగా కూరగాయలే పండించేవారు. ద్రాక్షపండ్లు, సీతాఫలాలకు. మా ఊరి పక్కనే ఉన్న బాలానగర్ చాలా ఫేమస్. షాద్‌నగర్‌లో కూడా సీతాఫలాలు చాలా పండేవి. సీజన్ వచ్చినపుడు ఊళ్లోని కుర్రాళ్లంతా గోనె సంచులు పట్టుకుని గుట్టలెంబడి పోయేవాళ్లు. నీటి సౌకర్యం చాలా తక్కువ కావడంతో వరి ఎక్కువగా పండేది కాదు. ఊళ్లో మంచినీటి సౌకర్యం కూడా ఉండేది కాదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు దగ్గర నుంచి బిందెలతో మంచినీళ్లు తెచ్చుకునేవారు.

ఫేమస్ దర్గా...

మన రాష్ట్రంలో ఉన్న ఫేమస్ దర్గాల్లో షాద్‌నగర్ జహంగీర్ పీర్ దర్గా ఒకటి. ఆ దర్గాని 16వ శతాబ్దంలో కట్టారు. మొహరం, రంజాన్, బక్రీద్ పండుగలు చాలా బాగా చేసేవారు. తెలుగు పండగలంటే బోనాల పండగ. నేనెళ్లిన నెలరోజులకే ఊళ్లో నాకొక బ్యాచ్‌ని తయారుచేసుకున్నాను. రంజాన్ ఉపవాసాలు విడిచే సమయానికి పండ్లు పట్టుకుని ముస్లింల దగ్గరికి వెళ్లిపోయేవాళ్లం. హలీంల గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. పీర్ల పండగకి షాద్‌నగర్ కళకళలాడిపోయేది. పేరుకి ముస్లిం పండగైనా హిందువులే ఎక్కువ సంబరంగా జరుపుకునేవారు. ఊళ్లో వందేళ్లక్రితం కట్టిన శివాలయం, రామాలయం ఉండేవి. శివరాత్రి వచ్చిందంటే శివుని దర్శనం దొరికేది కాదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలసంఖ్యలో జనం వచ్చేవారు.

ఫ్యాక్షన్ గొడవలు...

నేను ఎమ్మెల్యేగా గెలిచాక ఊళ్లో 180 గజాల్లో ఇల్లు కట్టుకున్నాను. అప్పటికి చదువుల కోసం నా పిల్లలు హైదరాబాద్‌కి వచ్చేశారు. నా భార్య(విశ్వశాంతి) హైదారాబాద్‌కి, షాద్‌నగర్‌కి వస్తూపోతూ ఉండేది. డాక్టరు కాస్తా ఎమ్మెల్యే అయ్యాడు. గొడవలు, పంచాయితీలు అంటూ మా ఇంటికి ఊరి జనం రాకపోకలు బాగా పెరిగాయి. ఒకరోజు షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ మర్డర్ జరిగింది. ఆస్తితగాదాల్లో ఒకతను చిన్నాయనను కత్తితో పొడిచి చంపాడు. 'మా చిన్నాయన మంచోడు కాదు సామి, అందుకే చంపిన. నన్ను నువ్వే కాపాడాలి' అంటూ నా దగ్గరికి వచ్చాడతను. అతన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాను. అప్పటి నుంచి ఊళ్లో ఏ ఫ్యాక్షన్ గొడవ జరిగినా జనానికి పోలీస్‌స్టేషన్‌కి వెళ్లే ముందు నన్ను కలవడం అలవాటయిపోయింది.

ఊరి కోసం...

1982 నుంచి 2004 వరకూ ఏడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఆరు సార్లు గెలిచాను. షాద్‌నగర్‌కి కావాల్సిన అన్ని రకాల అభివృద్ధి పనులూ చేశాను. మంచినీటి సౌకర్యం, రోడ్లు, ఆసుపత్రి, హైవే...ఇలా ప్రభుత్వం చేయాల్సిన పనులన్ని దగ్గరుండి చేయించాను. 2009నాటికి షాద్‌నగర్ నియోజకవర్గం జనరల్ అయిపోయింది. దాంతో పార్టీ పెద్దలు నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. షాద్‌నగర్‌ని విడిచిపెట్టడం నాకు, నా నియోజక వర్గ ప్రజలకు ఇద్దరికీ ఇష్టంలేదు.

బలవంతంగా నన్ను ఇక్కడికి రప్పించారు. 22 రోజుల సమయం ఉండగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేయమని చెప్పారు. ఇక్కడ నాకున్న పేరు, పలుకుబడిని బట్టి కొద్దిరోజుల ప్రచారమే చేసినా మంచి మెజారిటీతో గెలిచాను. షాద్‌నగర్‌లో నేను కట్టుకున్న ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని మా అమ్మాయికి ఇచ్చేశాను. ఒకటీ రెండూ కాదు ముప్పైఏళ్ల అనుబంధం. నేను ఊరి వదిలిపెట్టినంత మాత్రాన ఆ ఊరి ప్రజలకు నాకు దూరం పెరగలేదు. షాద్‌నగర్ నుంచి పెళ్లి శుభలేఖలు, పిలుపులు, చావు కబుర్లు రోజూ వస్తూనే ఉంటాయి. ఇప్పటికీ డాక్టర్‌సాబు అని నన్ను పిలిచేవారున్నారక్కడ. శంకర్రావు షాద్‌నగర్‌వాడు. షాద్‌నగర్ శంకర్రావుది.''

'శంకరన్న మొఖం మీదనే మాట్లాడతడు. మాట దాచుకోడు, మూట దాచుకోడు' అంటారు. ఎవరి నోటెంటైనా ఆ మాట వినిపిస్తే నాకు వెంటనే మా అమ్మ గుర్తొస్తుంది.

అమ్మ చెప్పిన మాట...

నేను ఎంబిబిఎస్ పాసయ్యాక అమ్మ(రాజ నర్సమ్మ) ఒక మాట చెప్పింది. 'బిడ్డా...పేరుతో పెరగాలె గాని పైసతో కాదు, ఎవరి మనసైనా కల కల అంటే మన బతుకులు సల్లగుండవు' అనేది. నిజమే నలుగురి సాయం చేసి నలుగురి మధ్యలో బతికితే ఎంత పేరు వస్తుందో నాకు షాద్‌నగర్‌కి వెళ్లాక అర్థమైంది. నేను పుట్టి పెరిగిన ఊరు కాకపోయినా ఆ ఊరు నన్ను సొంతబిడ్డను చూసినట్టు చూసుకుంది. మొదట్లో నా ప్రవర్తనకు, సిద్ధాంతాలకు అడ్డుపడ్డవారంతా కొన్నాళ్లకు నా అనుచరులుగా మారిపోయారు. నా వెనక తిరిగిన కుర్రాళ్లను నేను నాయకులుగా చేశాను. నా గురించి వారినెవ్వరిని అడిగినా...'శంకరన్న మొఖం మీదనే మాట్లాడతడు. మాట దాచుకోడు, మూట దాచుకోడు' అంటారు. ఎవరి నోటెంటైనా ఆ మాట వినిపిస్తే నాకు వెంటనే మా అమ్మ గుర్తొస్తుంది.

ఎమ్మెల్యే శంకర్రావు...

నాన్న(రాజయ్య) ఆల్విన్ ఉద్యోగి. నేను పుట్టింది హైదరాబాద్‌లోనైనా నాన్న ఉద్యోగం నిమిత్తం పూనెకు వెళ్లాల్సివచ్చింది. అక్కడినుంచి ముంబయికి వెళ్లాం. నాకు పదేళ్లు వచ్చేవరకూ బయటి రాష్ట్రాల్లో ఉన్నాను. తర్వాత హైదారాబాద్‌కి వచ్చేశాను. ఇక్కడ ఎంబిబిఎస్ చదివి డాక్టర్ ప్రాక్టీసు పెట్టుకున్నాను నేను. యూత్‌కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు నాకు మంచి దోస్త్. నాగం జనార్దన్ నా రూమ్మేట్. రాజకీయ నాయకులతో నాకున్న పరిచయాలతో షాద్‌నగర్ సీటు విషయం నా దృష్టికి తెచ్చారు.

కొద్దిరోజుల్లోనే ఆ నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకున్నాను. ఎన్నికల ముందు ప్రతిపక్షనాయకులతో కూడా మాట్లాడేవాడ్ని. నాకు పోటీగా నిలబడే అభ్యర్థుల విషయంలో జోక్యం చేసుకునే చనువుండేది నాకు. ఎవరు నిలబడ్డా పేరుకే.. గెలిచేది నేనేనని అందరికీ తెలుసు. ప్రతి ఎన్నికల ప్రచారానికి షాద్‌నగర్ ఊరి జనం నిద్రాహారాలు మాని నా వెంట తిరిగేవారు. వాళ్లకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను.

No comments:

Post a Comment